Wednesday, November 18, 2015

మనుషుల ప్రాణాలు ముఖ్యమా, గోవుల ప్రాణాలు ముఖ్యమా?

ఐదేళ్ళ పసిపాపని రేప్ చేసి, ఆధారం మాయం చెయ్యడానికి మర్దర్ చేసినవాణ్ణి benefit of doubt పేరుతో వదిలేసే చట్టాలు ఉన్న దేశం మనది. ఇదే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆవు మాంసం తిన్నవానికి 10 ఏళ్ళు కారాగార శిక్ష వేస్తారు. మన దేశంలో మర్దర్‌లూ, రేప్‌లూ చెయ్యడం కంటే గోహత్య చెయ్యడమే మహాపాపమైపోయింది.

ముసలైపోయి పాలు ఇవ్వలేని ఆవుల్ని వాటి యజమానులు మాంసం వ్యాపారులకి తక్కువ ధరకి అమ్మేస్తారు. అందుకే మన దేశంలో ఆవు మాంసం చవకగా దొరుకుతుంది, పేదవాళ్ళు ఆ చవకగా దొరికే మాంసాన్ని ఇష్టంగా తింటారు. పేదవాళ్ళకి మనం తిండి పెట్టలేనప్పుడు వాళ్ళు ఏమి తిన్నా మనం అభ్యంతరం చెప్పకూడదు.

మా ఊరు రాయగడ జిల్లా పిపలగూడ. ఆ ఊర్లో వ్యవసాయ కార్మికులు తీసుకునే కూలీ రోజుకి 50 రూపాయలు మాత్రమే. వాళ్ళందరూ ఆదివాసులు. ఆదివాసులైనా వాళ్ళకి 50 రూపాయల కూలీ బతకడానికి ఎలా సరిపోతుంది అనే సందేహం నాకు మొదట్లో వచ్చింది. వాళ్ళు ఎక్కువగా అంబలి తింటారు. అది అన్నం కంటే చాలా చవకైనది. ఆ వ్యవసాయ కార్మికులు కూడా కొంత సొంత భూమి ఉన్నవాళ్ళు. వాళ్ళు తమ భూమిలో చోళ్ళు వేసుకుని, అవి పండిన తరువాత ఎండబెట్టుకుని, వాటితో అంబలి చేసుకుని తింటారు. వాళ్ళు వేరేవాళ్ళ వరి పొలాల్లో ఉడుపులూ, కోతలూ లాంటి పనులు చేసి కూలీ తీసుకుంటారు. వాళ్ళు పొద్దుతిరుగుడు (సూర్యముఖి) పంట కూడా వేసుకుని, ఆ పంటని వాళ్ళు దగ్గరలోని పేంట అనే గ్రామంలో నూనె మిల్లులో ఆడించి, నూనె తీసుకుని అది వాడుతారు. వాళ్ళకి కావలసిన కూరలూ, నూనెలూ వాళ్ళే పండించుకుంటారు కనుక వాళ్ళకి బతకడానికి పెద్ద ఖర్చు అవ్వదు.

నా పొలానికి diesel pump అవసరం అయ్యింది. అది కొనడానికి కనీసం పద్దెనిమిది వేలు ఖర్చవుతుంది. వర్షం పడకపోతే diesel pump ద్వారా వెనుక ఉన్న చెరువు నుంచి నా మెరక మీదకి నీరు ఎక్కించాలనుకున్నాను. నేను నా పొలం నుంచి నడుచుకుని వెళ్తుండగా దారిలో ఒక గుడిసె దగ్గర diesel pump కనిపించింది. దాని అద్దె గురించి మాట్లాడడానికి ఆ గుడిసెకి వెళ్ళాను. ఆ diesel pump యజమాని తండ్రి ఎలకని కాలుస్తూ కనిపించాడు. "మీరు ఎలుకల్ని తింటారా?" అని అడిగితే "తింటాం" అనే చెప్పాడు. అంతకు ముందు ఆ ఊర్లో ఉడుములు తినేవాళ్ళని కూడా చూసాను. వాళ్ళు ఎలుకలూ, ఉడుములూ తింటారు కాబట్టే వాళ్ళకి తిండికి పెద్ద ఖర్చవ్వదు. అందుకే వాళ్ళు 50 రూపాయలు కూలీ ఇచ్చినా బతకగలుగుతున్నారు. ఆ గుడిసె దగ్గర పొద్దుతిరుగుడు మొక్కలు ఉన్నాయి. "మీరు సూర్జముఖి పంటని ఎక్కడ అమ్ముతారు" అని అడిగాను. "పేంట దగ్గర ఒక నూనె మిల్లు ఉంది. ఆ నూనె మిల్లు యజమానికి డబ్బులు ఇస్తే సూర్జముఖిని ఆడించి నూనె తీసి ఇస్తాడు, వాడు పంట కొనడు" అని చెప్పారు. మనం refined sunflower oil (శుద్ధి చేసిన సూర్యముఖి నూనె) వాడుతాం కాబట్టి మనకి నూనె ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ మిల్లులో ఆడించిన నూనె వాడే ఆ ఆదివాసులకి ఆ ఖర్చు పెద్దగా ఉండదు.

ఆవు మాంసం తినేవాళ్ళని అది తిననిద్దాం. వాళ్ళకి మనం తిండి పెట్టనప్పుడు వాళ్ళకి ఏది చవకైతే అది తినే స్వేచ్ఛని వాళ్ళకి ఉండనిద్దాం. వాళ్ళేమీ అడుక్కుతినడం లేదు. వాళ్ళకి దొరికింది వాళ్ళు తింటున్నారు, అంతే. చికెన్ కిలో 160 రూపాయలు, ఆవు మాంసం కిలో 120 రూపాయలు, అడవిలో దొరికే ఉడుము మాంసం అయితే ఫ్రీగా వస్తుంది. పేదవానికి ఉడుము మాంసమూ, ఆవు మాంసమూ తినొద్దని చెప్పి చికెన్ తినమని చెపితే, వాని తిండికి అయ్యే ఖర్చు అది చెప్పినవాడే భరించాలి.                  

Sunday, November 15, 2015

ఆడపిల్ల చేత ఇంత సాహసం చెయ్యించే ధైర్యం ఎవరికైనా ఉందా?

ఒక ఆడపిల్ల ఉంది. ఆమె తండ్రి చనిపోయాడు. ఆమె చిన్నాన్న ఆమెకి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆమె కోర్త్‌లో కేస్ వేసి ఆమె తన తండ్రి వాటాలో మూడెకరాల వ్యవసాయ భూమి తెచ్చుకుంది. ఆమె ఆ భూమిని ఒక వ్యక్తికి కౌలుకి ఇచ్చింది. ఆ ఊరు రైల్వే స్తేషన్‌కి 18 కి.మి. దూరంలో అడవిలో ఉంది. ఆమె ఆ ఊరికి రాదనుకుని, కేస్ ఓడిపోయినవాళ్ళు కౌలుకి తీసుకున్న వ్యక్తిని అడ్డుకున్నారు. ఆమె కోర్త్ కేస్ గెలిచినా ఆమెకి భూమి దక్కలేదు. అప్పుడు ఆమె బంధువులు ఆమెకి ఏమి సలహా ఇస్తారు? ఆమెకి "ఈ గొడవంతా ఎందుకు, బుద్ధిగా పెళ్ళి చేసుకుని వెళ్ళిపో" అని చెపుతారు కానీ తన చిన్నాన్న మీద పోలీస్ కంప్లెయింత్ ఇవ్వమని మాత్రం చెప్పరు. చలం గారి అభిమానులమని చెప్పుకునేవాళ్ళు కూడా తమ వ్యక్తిగత జీవితాల్లో ఆ స్థాయిని దాటి ఆలోచించరు.

నేను కోర్త్ కేస్‌లో గెలిచిన భూమిని మొదట్లో మా ఊరికి చెందిన దోంబో రాముడు అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చాను. కోర్త్ కేస్ ఓడిపోయినవాళ్ళ భూమి నా భూమి పక్కనే ఉంది. వాళ్ళు దోంబో రాముణ్ణి భూమి దున్ననివ్వలేదు. "ప్రవీణ్ గాడు విశాఖపట్నంలో ఉంటాడు, విమానం మీద తిరుగుతాడు, వాణ్ణి రమ్మను, వాడు రాడు, వాడికి వ్యవసాయం ఏమి తెలుసు" అంటూ మాట్లాడారు. వాళ్ళు నా పొలంలో ఆకు కూడా వేసారు. దోంబో రాముణ్ణి అడ్డుకున్నవాళ్ళ దగ్గరకి నేను వెళ్ళి అడిగాను. తాము దోంబో రాముణ్ణి అడ్డుకోలేదని చెప్పారు. కానీ వాళ్ళు నా పొలంలో ఆకు ఎలా వేసారో అనే దానికి సమాధానం చెప్పలేదు. నేను power tillerని అద్దెకి తీసుకుని ఆ భూమి దున్నించాను. కానీ వాళ్ళు నన్ను ఆకు ముట్టుకోవద్దు అంటూ బెదిరించారు. నేను పోలీస్ కంప్లెయింత్ ఇచ్చాను. వాళ్ళు ఆకు తొలిగించుకున్నారు. నేను కొత్తగా పంట వేసాను. నేను వారానికి ఒకసారి ఆ ఊరు వెళ్ళి, నా పొలంలో నీళ్ళు ఉన్నాయో, లేదో చూసి వస్తున్నాను. నిన్ననే నా పొలం ఉన్న మెరక మీద కొత్త నీటి ఊట బయట పడింది. ఆ ఊటకి అడ్డుగా ఉన్న అడవి మొక్కలు నరికి, ఆ నీళ్ళు నా పొలంలోకి వెళ్ళే దాకా దారి తవ్వాను.

ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఆమెకి ధైర్యంగా ముందుకు వెళ్ళి వ్యవసాయం చెయ్యమని చెప్పరు. ఆమె బంధువులు ఆమెని ఏ ఉద్యోగస్తునికో ఇచ్చి పెళ్ళి చేసి పంపించాలనుకుంటారు తప్ప ఆమెకి ఈ సాహస కార్యాలు చెయ్యమని ప్రోత్సాహం ఇవ్వరు. తాను చలం గారి అభిమానినని చెప్పుకునే మా బంధువు ఒకాయన నా పెళ్ళి జరగకుండా అడ్డుకోవాలనుకున్నాడు. అతనికి ఆడపిల్ల ఉంది. ఆమెని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని అతని కోరిక. నా లాంటి under employed (పెద్ద చదువులు చదివి చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు)కి పెళ్ళిళ్ళు అయితే తన కూతురికి కూడా అలాంటి మొగుడే దొరుకుతాడని అతని భయం. అతని ఉద్యోగాన్ని చూసి అతని సొంత మేనకోడలినే అతనికి ఇచ్చి పెళ్ళి చేసారు. అతనికి ఉద్యోగం వస్తే అతన్ని తన మేనకోడలికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని అతని బంధువులు అతని చిన్నపటి నుంచి అనుకుంటూనే ఉన్నారు. ఆడదానికి అందం ముఖ్యం, మగవానికి ఉద్యోగం ముఖ్యం అని అతను నమ్మడానికి కారణం అతను పుట్టి పెరిగిన పరిస్థితులే. సామాజిక కట్టుబాట్లని దాటలేని అతను చలం గారి పేరు చెప్పుకోవడం అనవసరమే.